హైదరాబాద్: రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందాన్ని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఢిల్లీకి అహ్వానించారు. మంత్రి జానారెడ్డికి, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని ఆయన చెప్పారు. ఆజాద్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య ధ్రువీకరించారు. ఢిల్లీకి ఎవరెవరు ఎప్పుడు వెళ్లాలనే విషయాన్ని రేపు (సోమవారం) నిర్ణయిస్తామని ఆయన ఆదివారం సాయంత్రం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమ లక్ష్యమని, ఢిల్లీలో తమ తెలంగాణ వాణిని వినిపిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా ఒకే తాటిపై ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయారనే విమర్శలో నిజం లేదని, ఎవరూ ముఖ్యమంత్రికి అమ్ముడుపోలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నాయకులతో కలిపి సంప్రదింపులు జరపడానికే ఆజాద్ తెలంగాణ నాయకులను ఢిల్లీకి అహ్వానించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నాయకులకు ఇప్పటికే 18వ తేదీన అధిష్టానం పెద్దలు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇరు ప్రాంతాల నేతలను కలిపి ఆజాద్ చర్చలు జరుపుతారా, విడివిడిగా జరుపుతారా అనేది తెలియడం లేదు.