హైదరాబాద్: రాజధాని మాది అంటున్న తెలంగాణవాదులు గతంలో హైదరాబాదు రాష్ట్రాన్ని పాలించిన నిజాం వచ్చి అడిగితే ఇచ్చేస్తారా అని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తెలంగాణ వాదులను ప్రశ్నించారు. గురువారం ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను గాంధీ భవనంలో కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొంతం కాదన్నారు. హైదరాబాదుపై అందరికీ హక్కులు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల కోసమే తెలంగాణ నేతలు ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. పదవులు దక్కించుకోవడానికి ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారని అన్నారు.
సంవత్సరం క్రితం లేని మనోభావాలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి ఎలా వచ్చాయో అందరికీ తెలుసునన్నారు. సమైక్య వాదాన్ని కోరుతున్న తమ వాదన సరియైనది అన్నారు. గ్రేటర్ రాయలసీమకు తాను పూర్తి వ్యతిరేకం అన్నారు. అందుకు అంగీకరించేది లేదన్నారు. ప్రజల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఆంధ్రా ప్రజలు అందరూ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని అన్నారు. తమకు సమైక్యాంధ్ర తప్ప ఏదీ వద్దన్నారు. రాష్ట్రం పెద్దగా, భాషా ప్రయుక్తాలుగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్నారు.