విజయవాడ: నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అనుచరుడు, టిఎన్ఎస్ఎఫ్ నేత వడ్లమూడి మోహన్ హత్య కేసులో ప్రధా నిందితుడితో సహా ఎనిమిది మందిని విజయవాడ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వల్లభనేని నాగరాజు ఆయన భార్య నళిని, మరో మహిళ రజనిలతో సహా ఎనిమిది మందిని పోలీసులు ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో అరెస్టు చేశారు. వీరిని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ముందు గురువారం ఉంచారని సమాచారం. నిందితులు గత కొన్నాళ్లుగా హైదరాబాదులోని హైటెక్ సిటీ పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యలో ఒకసారి షిరిడీ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బుధవారం హైదరాబాదు నుండి భద్రాచలం వెళ్లి అక్కడి నుండి విజయవాడ వెళ్లాలని వారు భావించారు.
అయితే ఫోన్ కాల్స్ ఆధారంగా భద్రాచలం చేరుకున్న వారిని విజయవాడ నుండి రెండు పోలీసు ప్రత్యేక బృందాలు వెళ్లి అదుపులోకి తీసుకున్నాయి. కాగా మోహన్ హత్య కేసులో మొత్తం పదిహేను మంది నిందితులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే నిందితులు అందరూ మోహన్‌కు పోస్టుమార్టం జరిగే సమయం వరకు విజయవాడలోనే ఉన్నారు. ప్రమాదంలో చనిపోయారని అందరూ భావించిన నేపథ్యంలో వారు అక్కడే ఉన్నారు. అయితే పోస్టుమార్టం అనంతరం అది హత్యగా తేలడంతో వారు విజయవాడ ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది. మోహన్ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు కావడంతో పోలీసులు అతనిపై గతంలో ఉన్న రౌడీషీట్ తిరిగి ఓపెన్ చేశారు.