నిర్ణయాలకు నా తండ్రి ఒక్కడే కారణం కాదు: జగన్

తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు సిబిఐ విచారణకు డిమాండ్ చేశాయని వివరించారు. రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంలో భాగంగా కడప ఉప ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైయస్ హయాంలోని భూకేటాయింపులపై సభాసంఘం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. గత ఉప ఎన్నికల్లోనే సిబిఐ దర్యాఫ్తు జరిపితే అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూసినప్పటికీ వారికి ఫలితం దక్కలేదని, సీనియర్ నేతలు డిపాజిట్ కోల్పోయారని అందులో వివరించారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తన తండ్రి ఇమేజ్ జాతీయస్థాయిలో దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఆధారాలు లేని రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం వేశారని చెప్పారు. వైయస్ హయాంలో లబ్ధి పొందిన వారు తమ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు వారు ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంపైనా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
కృష్ణపట్నం, గంగవరం పోర్టు, ఎమ్మార్ ప్రాజెక్టు, రహైజా పార్కు, వాడరేవు, కాకినాడ పోర్టు ప్రైవేటీకరణ, శంషాబాద్ ఎయిర్ పోర్టు తదితర కేటాయింపులన్నీ టిడిపి హయాంలోనే జరిగినవన్నారు. తన తండ్రి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తన తండ్రి మంత్రి పదవి ఇవ్వలేదనే శంకర్ రావు అక్కసుతో నాపై విచారణ చేయాలని లేఖ రాశారని ఆరోపించారు. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి దక్కిందని చెప్పారు. తనకు ఆస్తులు కొత్తగా వచ్చినవి కావన్నారు. తాను గతంలో కొన్న వాటికి ఇప్పుడు ధరలు పెరిగాయని చెప్పారు. కొన్ని ఆస్తులు తమ అత్తగారివని చెప్పారు. వాటిని ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications