తెలంగాణ ఇప్పట్లో రాదని తేల్చేసుకున్న కెసిఆర్

పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనతో ఆయన అసలు విషయం అర్థం చేసుకున్నట్లు భావిస్తున్నారు. సకల జనుల సమ్మెతో కాంగ్రెసు అధిష్టానం దిగిరాకపోతే 2014 ఎన్నికల్లో చూసుకుంటామనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. చిదంబరంపై ఆయన చిందులు వేశారు. చిదంబరం దిక్కుమాలిన ప్రకటన చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తర్వాత చర్చల ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఎప్పటికప్పుడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, హోం మంత్రి పి. చిదంబరం అసలు విషయం చెబుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదనే విషయాన్ని వారు పలు సందర్భాల్లో చెప్పారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని చిదంబరం చెబుతుండగా, తెలంగాణ అంశం మళ్లీ మొదటికి వచ్చిందని ఆజాద్ చెప్పారు. దశాబ్దాలు కలిసి ఉన్నారు, శతాబ్దాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా, తమ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులను దారికి తెచ్చుకునే మార్గాలను మాత్రమే కాంగ్రెసు అధిష్టానం అన్వేషిస్తుందనేది స్పష్టం. ఈ విషయం ఇప్పుడు కెసిఆర్‌కు అర్థమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications