AP weather: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు..! ఐఎండీ అలర్ట్..!
ఏపీని మరోసారి వర్షాలు (Rains) పలకరించబోతున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరటనిచ్చేలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) రేపటి వాతావరణ (AP Weather) వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే కోస్తాంధ్రలో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు . సముద్రం అలజడిగా ఉండి, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్నబోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications