రోశయ్యపై తెలంగాణ అస్త్రాలు, చంద్రబాబుకు ఊరట

ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు దాన్ని కొత్త మలుపు తిప్పారు. రాజీనామాల డ్రామాను అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య నడిపించారంటూ కొత్త వివాదానికి తెర తీశారు. తమ పార్టీ అధిష్టానం సూచనల మేరకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించకుండా రాజీనామాల డ్రామాను నడిపించారని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో, అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో కుమ్మక్కయి రోశయ్య సీమాంధ్ర శాసనసభ్యులతో రాజీనామాలు చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని ఆయన అన్నారు. దీంతో రోశయ్య ఇరకాటంలో పడ్డారు. ఇది చంద్రబాబుకు కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
కెసిఆర్ నిరాహార దీక్ష నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో అధిష్టానం సూచన మేరకు రోశయ్య అప్పుడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలూ తీసుకున్నారు. తాము తెలంగాణకు అనుకూలమని అన్ని పార్టీలూ స్పష్టం చేశాయి. మినిట్స్ కూడా రికార్డు చేశారు. దాన్ని పట్టుకుని రోశయ్య ఢిల్లీ వెళ్లారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేశారు. కానీ, రోశయ్య హైదరాబాదు రాగానే సీన్ మారిపోయింది.
అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించే తరుణంలో సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామాలకు దిగారు. దాంతో అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించే ఎజెండా వెనక్కి పోయింది. అయితే, తీర్మానం ప్రతిపాదిస్తే నెగ్గబోదని తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లు రోశయ్య ఇప్పుడు చెబుతున్నారు. అయితే, ఓ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం నెగ్గాల్సిన అవసరం కూడా లేదు. అసెంబ్లీ అభిప్రాయం వస్తే చాలు. కేంద్రం తనంత తానుగా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. దాన్ని పరిగణనలోకి తీసుకునే తీర్మానమే ప్రతిపాదించకుండా తెలంగాణను రోశయ్య అడ్డుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఏమైనా, చంద్రబాబుకు మాత్రం కొంత ఊరట లభించింది.












Click it and Unblock the Notifications