పద్మనాభుడి చుట్టూ మిస్టరీ, ప్రళయం తప్పదా?

మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు వస్తున్నాయి. ఆరో నేలమాళిగకు సముద్రానికి లింక్ ఉందని, ఆరో నేర మాళిగను తెరిస్తే అరిష్టంతో పాటు ప్రళయం కూడా సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే తరహాలో కోనేటిలోని నిధులపై చెయ్యేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు భయాందోళనలకు గురవుతున్నారు. ఆలయం, ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని ఒకవేళ ఆ గదులను తెరిస్తే సముద్ర నీరు ఆ మార్గాల ద్వారా చొచ్చుకువచ్చి, ముంచేస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడ్డ సంపద లెక్కింపుపై జ్యోతిష్యం ద్వారా దైవనిర్ణయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన 'దేవప్రశ్నం" ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ ప్రక్రియలో స్వామి సంపద లెక్కింపుకు ప్రతికూల సంకేతాలు వచ్చాయి. దేవప్రశ్నంలో వ్యతిరేకమైన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు.
విలువ కట్టలేని బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను ప్రదర్శనకు ఉంచడం వల్ల వాటి పవిత్రత పోతుందని జ్యోతిష్యులు తెలిపారు. ఇప్పటివరకు తెరవని నేలమాళిగ 'బీ" ని తెరవాలని ప్రయత్నించే వారికి ముప్పువాటిల్లవచ్చునని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభుని సంపద లెక్కించాలని కోర్టు కెక్కిన సుందర రాజన్ మృతి చెందాడని ఉదహరిస్తున్నారు. ఇటీవలి అగ్నిప్రమాదం కూడా అనంతపద్మనాభుడి ఆగ్రహం వల్లనే సంభవించిందని భావిస్తున్నారు. కాగా, గర్భాలయంలో నూనెతో దీపాన్ని వెలిగించకుండా విద్యుత్ దీపాన్ని పెట్టడంపై స్వామివారు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. తాను తలుచుకున్నప్పుడు ఆరో నేలమాళిగ తలుపులను స్వామివారే తెరుస్తారని జ్యోతిష్కులు అంటున్నారు.












Click it and Unblock the Notifications