అనుకున్నది సాధించిన కెవిపి రామచందర్ రావు

KVP Ramachandar Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్రారావు అనుకున్నది సాధించినట్టుగానే కనిపిస్తోంది. ఆయన వ్యూహం జగన్‌కు ధీటుగా ఎదుర్కోవడమైనా, వైయస్‌ను అధిష్టానం దృష్టిలో హీరోగా నిలపడమైనా, మరేమైనా కెవిపి అనుకున్నది సాధించినట్లుగా కనిపిస్తోంది. వైయస్‌పై ఆయన రూపొందించిన వైయస్సార్ - మ్యాన్ ఆఫ్ ది పీపుల్‌కు రాష్ట్ర నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు వచ్చి వైయస్‌ను పొగడ్తలలో ముంచెత్తారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది వైఎస్, కెవిపిలేనని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశంసించారు. నమ్మినవారిని వైఎస్ ఎప్పుడూ నట్టేట ముంచలేదని, ఎందరో నేతలను తయారు చేశారని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడిన నేత అని, అట్టడుగు ప్రజల ఆత్మబంధువు, దళితులు, గిరిజనుల సేవకు కృషిచేసిన వ్యక్తి అని ఢిల్లీ పెద్దలు ప్రశంసల వర్షం కురిపించారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్‌వాది అని, పార్టీ అధినేత్రి సోనియాకు అత్యంత విధేయుడైన నేత అని ప్రశంసించారు. కేవీపీ-వైఎస్‌ల బంధం అపురూపమని, అలాంటి స్నేహం తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. వైఎస్ అద్భుతమైన వ్యక్తి, గొప్పమనిషి, ఇష్టపడినవారిని అమితంగా ప్రేమించే వ్యక్తి, ఏదైనా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేసి సాధించే వ్యక్తి అని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పొగిడారు.

మంగళవారం ఇక్కడ ఇండియా ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన వైఎస్ ఛాయాచిత్ర పుస్తకావిష్కరణ సభలో వారు ప్రసంగించారు. వైఎస్ అసమ్మతి నేతగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారని, ఆయన గురిం చి తెలిసిన వారు ఆయనను గొప్పమనిషిగా గ్రహిస్తారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేవీపీ, వైఎస్ ఇద్దరూ కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు. నమ్మినవారికి కీలకబాధ్యతలు అప్పజెప్పారన్నారు. అసెంబ్లీలో తనను, బయట కేవీపీని ఆయన విశ్వాసంలోకి తీసుకునేవారన్నారు. వైఎస్ ఏది చేసినా ప్రణాళికబద్ధంగా చేస్తారన్న కిరణ్.. నక్సలిజాన్ని ఆరునెలల్లో రూపుమాపుతానని చెప్పి మరీ సాధించారని ప్రశంసించారు. టీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినా నక్సలైట్ల వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, అందుకే ఆరు నెలలు వేచి చూడాల ని వైఎస్ సూచించినట్లు గుర్తు చేసుకున్నారు.

అభివృద్ధిని కూడా అంతే ప్రణాళికాబద్ధంగా సాధించారన్నారు. వైఎస్, తాను పార్టీలో కష్టసుఖాల్లో కలిసి పెరిగామని, వందలాది బహిరంగ సభల్లో ప్రసంగించామని గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఆయన ప్రజల మనిషి, గొప్ప పరిపాలనాదక్షుడని పొగిడారు. తాను జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ మేఘాల మధ్య చిక్కుకుపోయి చివరకు బతికి బయటపడ్డానన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఒకప్పుడు వైఎస్ టీమ్‌లో ఉన్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స కలిసికట్టుగా పనిచేయాలని, కేవీపీ సలహాలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హితవు చెప్పారు. వైఎస్, కేవీపీలవంటి మిత్రులను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ ఏదైనా దృఢవిశ్వాసంతో చెప్పేవారని, 2009 ఎన్నికల్లో పార్టీ కి 33 సీట్లు ఖాయమని ఎంతో ముందుగా చెప్పారని వోరా అన్నారు.

మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషిచేశారన్నారు. సెప్టెంబర్ 2న ఆయన, కేవీపీ తనను రాజ్‌భవన్‌లో కలిశారని, 60 ఏళ్ల తర్వా త రిటైరవ్వాలనుకున్నా మరికొన్ని రోజులు ప్రజలకు సేవచేయాలనుకున్నానని చెప్పారని తెలిపారు. ప్రతి జిల్లాకు వెళ్తానని తనతో చెప్పి.. కొద్దిరోజులకే మరణించారని వోరా గద్గద స్వరంతో చెప్పారు. కాంగ్రెస్‌కే కాక, సోనియాగాంధీకి, ఆమె కుటుంబానికి విశ్వాసపాత్రుడు వైఎస్ అని వాయలార్ రవి అన్నారు. మొత్తానికి వైఎస్ వారసత్వం తనదేనని జగన్ ప్రచారం చేస్తున్న సమయంలో ఢిల్లీ పెద్దలు వైఎస్‌ను మరిచిపోకుండా చేయడంలో, వైఎస్ అస్మదీయులను సంఘటితపరచడంలో కేవీపీ కృతకృత్యులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+