తెలంగాణ సమ్మెతో పరిస్థితి చేయి దాటి పోతోందా?

రాష్ట్ర పరిస్థితులపై రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. వారు సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆంటోనీని కలిసి తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆంటోనీ చెప్పినట్లు వారు తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. పార్లమెంటులో మెజారిటీ లేనందుననే తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జాప్యం చేయడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపైనే కాకుండా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు లడపాటి రాజగోపాల్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే కాదు మంత్రులు కూడా వీధుల్లోకి వచ్చారు. వారిపై పార్టీ నియంత్రణ గానీ, ముఖ్యమంత్రి నియంత్రణ గానీ లేకుండా పోయింది. అధికార పార్టీకి ఆ పార్టీ నేతలే పెద్ద సమస్యగా తయారయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సకల జనుల సమ్మెను పరిష్కరించడానికి గానీ పరిస్థితిని అదుపులోకి తేవడానికి గానీ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ లేవనే ప్రచారం జరుగుతోంది. పరిస్థితి ఆయన చేతులు దాటిపోయినట్లుగా కూడా భావిస్తున్నారు. పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో కూడా చెప్పలేని వాతావరణం ఉంది. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు దానం నాగేందర్, పిసిసి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కానీ, ఆయన తీసుకునే చర్యలేమిటనేది అర్థం కావడం లేదు. ప్రజల సమస్యలు చెప్పదలుచుకుంటే చాలానే ఉన్నాయి. రవాణా సౌకర్యాలు లేవు. కరెంట్ కోత అమలవుతోంది.
సాధారణ పరిస్థితులను నెలకొల్పే స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి లేరనే మాట వినిపిస్తోంది. మంత్రులు కూడా ఆయన మాటలు వినడం లేదు. తెలంగాణపై పోరాటం చేస్తున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రులే కాకుండా శంకరరావు వంటి మంత్రులు ముఖ్యమంత్రికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిని పట్టించుకోవడం లేదనే మాట వినిప్తోంది.












Click it and Unblock the Notifications