ఈ నెలఖారులో తెలంగాణపై నిర్ణయం: లగడపాటి
హైదరాబాద్ : తెలంగాణ అంశంపై ఈ నెలాఖరులోగా తమ పార్టీ అధిష్టానం తన వైఖరి వెల్లడించబోతోందని, మిగతా పార్టీలు కూడా అభిప్రాయం చెప్పాలని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్ర పరిణామాలపై పార్టీ అధిష్టానం నాయకులందరితో చర్చలు కొనసాగిస్తోందని, కసరత్తు త్వరలోనే పూర్తయి నెలాఖరులోగా నిర్ణయం వస్తుందని ఆయన ఆదివారంనాడు అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉన్నందున ప్రత్యేకంగా సమైక్య ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు అవసరంలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం తనకు బాధను కలిగించిందన్నారు. సకల ఉద్యోగుల సమ్మెగా మారిందన్న తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకుడు స్వామిగౌడ్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సకలజనుల సమ్మె వల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో దాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, పిల్లకాలువలు ఇందులోకి వచ్చి కలవాలేగానీ మహాసముద్రం వెళ్లి పిల్లకాలువలో కలవదంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications