చంద్రబాబుపై విరుచుకుపడిన బొత్స సత్యనారాయణ

చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు పరిష్కరించాలని గానీ రుణాలు మాఫీ చేయాలని గానీ ఏనాడైనా ప్రధానిని కోరారా అని ఆయన అడిగారు. రాజకీయాల్లో పరుష పదజాలం మంచిది కాదని ఆయన చంద్రబాబుకు సూచించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తాను పెద్దవాడిని అయ్యానని చంద్రబాబు అనుకుంటున్నారని, వేలెత్తి చూపించే ముందు తానేమిటో తెలుసుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఎక్కడ తిరిగితే అక్కడ కరువు తాండవిస్తోందని, అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించారని, అక్కడ కరువు చోటు చేసుకుందని ఆయన అన్నారు.
తెలంగాణ చిన్న సమస్య కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాటల్లో తప్పు లేదని, నిర్ణయం జనవరి లోపు అంటే 30 ఏళ్లు ఆగాలని కాదని ఆయన అన్నారు. రేపు, ఎల్లుండైనా నిర్ణయం రావచ్చునని ఆయన అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆయన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. సిబిఐ విచారణ జరుగుతున్న సందర్భంలో వైయస్ జగన్‌పై మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ తన వల్ల రాలేదని చంద్రబాబు అంటున్నారని, ప్రోటాన్ కంపెనీ ఎవరి వల్ల వచ్చిందో చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications