తెలంగాణ ప్రకటనకు రెండేళ్లు: విషమించిన రాష్ట్ర పరిస్థితి

తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించి కూడా ఏడాది దాటుతోంది. సమస్యను పరిష్కరించడానికి శ్రీకృష్ణ కమిటీ నిర్దిష్టమైన సిఫార్సు చేయడంలో విఫలమైంది. ఆరు సిఫార్సులు చేసి సమస్యను మరింత జఠిలం చేసింది. పరస్పర విరుద్ధమైన సిపార్సుల వల్ల తెలంగాణకు పరిష్కారం దొరకకపోగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తేల్చింది. ఆ సిఫార్సులను అమలు చేయడమనేది సాధ్యమయ్యే పని కాదు. ఆ నివేదిక తెలంగాణ సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది. రాష్ట్రంలో పరిస్థితి మాత్రం తీవ్రంగా విషమించింది.
కాంగ్రెసు తెలంగాణ నాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో తిరుగలేని పరిస్థితి వారికి ఏర్పడింది. భవిష్యత్తు అంధకారంలా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పుంజుకుంది. సకల జనుల సమ్మెతో రాష్ట్రం అతలాకుతలంగా మారింది. ఇటీవలి కాలంలో పరిస్థితి కాస్తా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడు నిప్పు రాజుకుంటుందో తెలియని పరిస్థితి. 2014లో వచ్చే ఎన్నికల నాటికి కూడా తెలంగాణ అంశాన్ని తెల్చే ఉద్దేశం కాంగ్రెసుకు లేదని అంటున్నారు. ఏమైనా, తెలంగాణ నాయకులకు రాజకీయాలు కత్తి మీద సాములా మారాయి.












Click it and Unblock the Notifications