వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌పాల్ పరిధిలోకి పిఎం, అన్నా టీమ్, విపక్షం గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు ఓ నిర్ణయానికి రాగలిగింది. అయితే ఆ బిల్లును అన్నా హజారే టీమ్, ప్రతిపక్ష బిజెపి వ్యతిరేకిస్తున్నాయి.ప్రధానమంత్రిని కూడా ఆ వ్యవస్థ పరిధిలోకి తెచ్చినా, ఆయనకు అనేక రక్షణలు కల్పించింది. అదే సమయంలో లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధ హోదాను కూడా కల్పించింది. అయితే సీబీఐని మాత్రం లోక్‌పాల్ పరిధి నుంచి తప్పించింది. ఈ అంశంపై అన్నా బృందం ఎంతగా పట్టుబట్టినా సర్కారు ఏమాత్రం తలొగ్గలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్నా బృందం భగ్గుమంది. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష, 30వ తేదీ నుంచి జైల్‌భరో ఉద్యమాలు చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.

ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం - లోక్‌పాల్‌లో తొమ్మిదిమంది సభ్యులుంటారు. చైర్మన్‌ను నలుగురు సభ్యుల కమిటీ ఎన్నుకుంటుంది. ఈ కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జీల నుంచి ఆయన నామినేట్ చేసిన వ్యక్తి ఉంటారు. అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాపాలన (పబ్లిక్ ఆర్డర్), అణు శక్తి, అంతరిక్షం, అంతర్గత, విదేశీ భద్రత లాంటి అంశాల్లో ప్రధానిపై విచారణ జరిపేందుకు లోక్‌పాల్‌కు అధికారం ఉండబోదు. ప్రధానిపై ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలా వద్దా అనే విషయాన్ని లోక్‌పాల్ ఫుల్‌బెంచి నిర్ణయించాలి. అందుకు అందులో కనీసం నాలుగింట మూడొంతుల మంది అంగీకరించాలి. దర్యాప్తు మొత్తం రహస్యంగా సాగుతుంది, ఒకవేళ ఫిర్యాదును కొట్టేస్తే ఆ రికార్డులను బహిర్గతం చేయకూడదు.

మంత్రుల బృందంతో పాటు పలువురు ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు ముసాయిదాపై తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడిన తర్వాత మంగళవారం 70 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ ప్రత్యేక సమావేశంలో రాజ్యాంగ సవరణతో కూడిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలిపారు. బిల్లును లోక్‌సభలో గురువారం ఈనెల 22న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తేవాల్సిందేనని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబట్టినా, ప్రభుత్వం మాత్రం అందుకు తలొగ్గలేదు. దానికి బదులుగా సీబీఐ డైరెక్టర్ నియామకానికి మాత్రం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. అలాగే, గ్రూప్ 'సి' ఉద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న అన్నా డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. వారు సీవీసీ పర్యవేక్షణ పరిధిలోకి వస్తారు.

అయితే సీవీసీ మాత్రం లోక్‌పాల్‌కు తన నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సీబీఐ వద్దకు వచ్చిన కేసులపై లోక్‌పాల్‌కు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. సీబీఐలో ఎస్పీలు, అంతకంటే ఉన్నతాధికారుల నియామకాన్ని సీవీసీ, విజిలెన్సు కమిషనర్లు, హోం శాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణశాఖ కార్యదర్శులతో కూడిన ఓ కమిటీ చూస్తుంది. లోక్‌పాల్ తనంతట తానుగా ఎలాంటి విచారణలు నిర్వహించకూడదు. అందుకు ఫిర్యాదు తప్పనిసరి. ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా సీబీఐని కూడా లోక్‌పాల్ కోరొచ్చు. ఆ విచారణ 180 రోజుల్లోగా పూర్తికావాలి. సీబీఐకి వివిధ కేసులపై తన నివేదికలను లోక్‌పాల్‌కు అందించాలి.

లోక్ పాల్ బెంచిలోని కనీసం ముగ్గురు సభ్యులు ఆ నివేదికను చూసి.. చార్జిషీటు దాఖలుచేయాలా, అసలు మూసేయాలా లేక శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించాలా అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. లోక్‌పాల్ బెంచితో పాటు సెర్చికమిటీలో కూడా ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం సభ్యుల్లో సగం మంది సభ్యులకు న్యాయ నేపథ్యం ఉండాలి. లోక్‌పాల్ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు ఉంటుంది. కనీసం వంద మంది ఎంపీలు కోరితే తప్ప చైర్మన్ లేదా సభ్యులపై అభిశంసన చేపట్టేందుకు వీల్లేదు.లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ఇలాగే ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని బీజేపీ తెలిపింది. ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు ప్రజలకు వెన్నుపోటులాగే ఉందని, ఇలాంటి అసమర్ధ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. సీబీఐని లోక్‌పాల్ పరిధి నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

English summary
The Cabinet finally cleared the Lokpal and Lokayukta bill on Tuesday evening, but their key formulations were promptly slammed by both Team Anna and the opposition, setting the stage for a continuing confrontation within and outside Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X