నా కోసం బెంగళూరు ట్రాఫిక్ ను ఆపే ఉద్దేశం లేదు: డీకే శివకుమార్ బిగ్ డెసిషన్.. !!
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలో కర్ణాటకలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాఖల కేటాయింపు వ్యవహారంలో మంత్రివర్గంలో అసమ్మతి సెగ చెలరేగినా అది టీకప్పులో తుఫానే అయింది. తన పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డిని డీకే శివకుమార్ బుజ్జగించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక పాలనపై ఆయన దృష్టి సారిస్తున్నారు.
తాజాగా తన సొంత నియోజకవర్గం కనకపురాకు బయలుదేరారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కనకపురాకు బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా ఈ ఉదయం తన అధికారిక నివాసం నుంచి విధాన సౌధ వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు. అక్కడి నుంచి సిల్క్ బోర్డ్ వరకు మెట్రో రైలులో ప్రయాణం సాగించారు. అక్కడి నుంచి నైస్ రోడ్ మీదుగా కనకపురాకు వెళ్లారు.

డీకే శివకుమార్ సాధారణ ప్రయాణికులతో కలిసి 'నమ్మ మెట్రో'లో ప్రయాణించారు. సామాన్యులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటూ సామాన్యుడి కోణంలో అక్కడి సౌకర్యాలను స్వయంగా గమనించారు. ప్రయాణికులతో మాట్లాడారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయన ప్రయాణం సాగింది. దారి పొడవునా ఆయన నిల్చొనే కనిపించారు. కోచ్ లల్లో కలియదిరగడం కనిపించింది. అనుకోకుండా డీకే శివకుమార్ రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనతో సెల్ఫీ దిగారు.
ఈ ప్రయాణం తనకు ఎంతో విలువైన అనుభవాన్ని ఇచ్చిందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ ప్రయాణం సురక్షితమైన, నమ్మదగిన, బడ్జెట్ అనుకూలమైన ప్రజా రవాణా వ్యవస్థల ప్రాముఖ్యతను స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో సామాన్య ప్రజల దైనందిన జీవితాల్లో మెట్రో వంటి రవాణా సౌకర్యాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బెంగళూరు అందరిదని, ఈ నగర భవిష్యత్తు.. సామాన్య పౌరుడికి మేలు చేసే, సులభతరమైన, ఆధునిక రవాణా పరిష్కారాల పైనే ఆధారపడి ఉందని డీకే శివకుమార్ అన్నారు.
నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించడంతో పాటు నిత్యం ప్రయాణించే వారి కష్టాలను తీర్చే దిశగా మెట్రో వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఇది నగరాభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి విలువైన ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని వివరించారు. ప్రజా సేవ అంటే అధికారం చలాయించడం కాదు, ప్రజల గొంతుకను వినడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, నిరంతరం వారితో మమేకమై ఉండటమేనని ఉద్ఘాటించారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అందరం కలిసి మరింత బలమైన, సుభిక్షమైన, పౌరులకు అత్యంత అనుకూలమైన కర్ణాటకను నిర్మించే దిశగా కృషి చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. "సామాన్యుల సమయం వృథా చేయడం ఇష్టం లేదు, వీఐపీలు ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. అందుకే దాన్ని నివారించడానికి 45-50 నిమిషాల పాటు మెట్రోలో ప్రయాణించాను.." అని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications