సంపూర్ణ సూర్య గ్రహణం- కనిపించే దేశాలు ఇవే
ఈ ఏడాది ఆగస్టు 12న ఆకాశంలో ఒక అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. దీన్ని వీక్షించడానికి స్కైగేజర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. దశాబ్ద కాలంలోనే అత్యంత ఆసక్తికరమైన ఖగోళ ఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సూర్యకాంతిని చంద్రుడు పూర్తిగా అడ్డుకునే ఈ మార్గాన్ని ఖగోళ శాస్త్రంలో 'పాత్ ఆఫ్ టోటాలిటీ' అని పిలుస్తారు. ఇది అరుదుగా ఏర్పడుతుంది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, స్పెయిన్, రష్యా, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. ఈ సూర్యగ్రహణ పాత్ పరిధిలోకి వచ్చే దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పగటిపూటే కొద్ది నిమిషాల పాటు సంపూర్ణ చీకటిని అనుభవించే అవకాశం ఉంది. స్పెయిన్ వంటి దేశాలు ఈ గ్రహణాన్ని చూసే పర్యాటకులతో సందడిగా మారనున్నాయి. పాత్ ఆఫ్ టోటాలిటీకి వెలుపల ఉన్న యూరప్, ఆఫ్రికా, ఆసియాలోని విస్తృత ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే నమోదవుతుంది.

యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా వంటి విశాల ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికా ఖండంలో అలాస్కా, ఉత్తర కెనడాలో ఉదయం వేళ గ్రహణ ప్రక్రియ మొదలై.. ఆ వెంటనే ముగుస్తుంది. అమెరికాలోని ఉత్తర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఆరంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. యూకే, ఐర్లాండ్, మెయిన్‌ల్యాండ్ ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో సాయంత్రం వేళ ఈ ఖగోళ దృశ్యం సాక్షాత్కరిస్తుంది. సంపూర్ణ గ్రహణ మార్గానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో సూర్యుడిలో కొంతభాగం మాత్రమే చంద్రుడి నీడలోకి వెళ్తుంది.
ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐరోపా ప్రాంతంలో దశాబ్దాల తర్వాత కనిపిస్తున్న అతిపెద్ద సంపూర్ణ గ్రహణాల్లో ఇది ఒకటి కావడమే దీనికి ప్రధాన కారణం. సూర్యుడి వెలుతురులో సాధారణంగా కనిపించని కరోనాను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశం. సంపూర్ణ గ్రహణ సమయంలో మాత్రమే సూర్యుని ప్రకాశం తగ్గుతుంది. తద్వారా ఈ అద్భుతాలను వీక్షించవచ్చు. పగటిపూటే ఆకాశంలో నక్షత్రాలు కనిపించడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు చోటుచేసుకుంటాయి.
భారత్ లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. దేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర- పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజలు సూర్యాస్తమయ సమయంలో కొంతమేర గ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని కళ్ళారా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు, ఖగోళ ప్రేమికులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే నగరాలు: లియోన్- స్పెయిన్, రేక్‌జావిక్- ఐస్‌ల్యాండ్, వలెన్సియా- స్పెయిన్, జరాగోజా- స్పెయిన్. పాక్షిక సూర్యగ్రహణం ప్రధాన నగరాల్లో యాంకరేజ్- అలాస్కా, బోస్టన్- మసాచుసెట్స్, డెట్రాయిట్- మిచిగాన్, ఫెయిర్‌బ్యాంక్స్- అలాస్కా, జూనో- అలాస్కా, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, అల్జీరియా, బెర్లిన్, మొరాకో, ఐర్లాండ్, కెనడా, పోలాండ్, పోర్చుగల్, బ్రిటన్, ఇటలీ, గ్రీన్‌ల్యాండ్, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, ట్యునీషియా, ఆస్ట్రియా దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.












Click it and Unblock the Notifications