వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం ఢిల్లీ టూర్: చిరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హడావిడిగా బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రాత్రే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమవుతారు. రేపు గురువారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు పలు అంశాలు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎజెండాలో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇచ్చే విషయంపై నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం మూడు మంత్రి పదవులు అడుగుతున్నారు. రెండు మంత్రి పదవులు మాత్రమే ఇస్తే రాయలసీమ నుంచి సి. రామచంద్రయ్యకు, కోస్తాంధ్ర నుంచి గంటా శ్రీనివాస రావుకు అవకాశం దక్కుతుంది. మూడో మంత్రి పదవి ఇస్తే తెలంగాణకు చెందిన అనిల్ దక్కించుకోవచ్చు.

చిరంజీవి వర్గానికి చెందినవారిని మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేస్తారని ఇప్పటి దాకా వార్తలు వచ్చాయి. అయితే, మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండవచ్చునని ఇప్పుడు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కొందరు సీనియర్లను తప్పించి కొత్తవారిని, తనకు అనుకూలంగా ఉండేవారిని కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. అయితే, పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి వస్తే అది సంక్రాంతి పండుగ తర్వాతనే ఉండవచ్చునని అంటున్నారు. ఈ లోపల తెలంగాణ సమస్యను కూడా పార్టీ అధిష్టానం పరిష్కరించవచ్చునని అంటున్నారు. తెలంగాణపై కూడా ఈ పర్యటనలో కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్టానం పెద్దలు మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కాగా, తాజాగా మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల వ్యవహారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చిచ్చు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే విషయంపై కూడా ఆయన మాట్లాడే అవకాశాలున్నాయి. దానితో పాటు తెలంగాణలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, కోస్తాలోని కోవూరుకు జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై కూడా ఆయన మాట్లాడుతారని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థులపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, మంత్రి శంకరరావు వ్యవహారాన్ని ప్రత్యేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించి అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గంలోని సభ్యులపైనే శంకరరావు విమర్శలు చేస్తుండడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, మంత్రి వర్గ సమావేశాలకు గైర్హాజరు కావడం, తనపైనా మంత్రులపైనా బహిరంగ విమర్శలు చేయడం వంటి విషయాలను ఆయన అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు కీలకమైన రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.

English summary
In his Delhi tour, CM Kiran kuamar Reddy may finalise the list Prajarajyam party MLAs for ministerial posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X