బాలయ్య, చిరంజీవి మెగా వార్: ఫ్యాన్స్ మధ్య చిచ్చు

ఇరువురి అబిమానుల మధ్య ఘర్షణ నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్‌లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం తోసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. సుమారు రెండు వందల మంది అభిమానులు ఇరువైపులా అక్కడకు వచ్చారు.
చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తిరుపతిలో ఘర్షణ ప్రారంభమై, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఇరు వర్గాలు రెండు వైపులా మోహరించి ఉన్నాయి. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications