హైదరాబాద్: దోచి దాచుకున్నవాడు యాత్రల పేరుతో తిరుగుతున్నాడని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మంత్రులు, అధికారులు దోషులుగా నిలబడాల్సి వచ్చిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విచారణ జరిగితేనే దోషులెవరో, నిర్దోషులెవరో తేలుతుందని ఆయన అన్నారు. అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కునేందుకు మంత్రి వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవినీతి కేసుల్లో ప్రతిపక్ష నాయకులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు.
తప్పులు జరిగితే మంత్రులు, అధికారులు ఎవరైనా బాధ్యులేనని ఆయన అన్నారు. సిబిఐ విచారణ పూర్తయితే దోషులెవరో తేలుతుందని ఆయన అన్నారు. అవినీతి ఉదంతాల్లో ఎవరి పాత్ర ఎంత అనేది సిబిఐ విచారణలో తేలుతుందని ఆయన అన్నారు.