హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో వెంటనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు. సోమవారం నుండి అసెంబ్లీ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం బిఏసిలో ఈ అంశంపై చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్ణయం తీసుకునేందుకు మార్చి నాలుగో తేది వరకు సమయం ఇస్తామన్నారు. అప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకుంటే మార్చి 4వ తేదిన జాగృతి ఆధ్వర్యంలో ఐదువేల మందితో ఇందిరా పార్కు వద్ద ఇరవై నాలుగు గంటల సామూహిక నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీని తీర్చిదిద్దిన ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం పెట్టడంపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఏప్రిల్ 14లోగా అంబేడ్కర్ కాంస్య విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయంలో తమతో కలిసి వచ్చే వారిని కలుపుకొని వెళతామన్నారు.
కాగా అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలన్న జాగృతి డిమాండు పైన తాము చర్చించి మద్దతిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. జాగృతి డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. అంబేడ్కర్ ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆన అన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సాధించుకునేందుకు ఎవరు ఏ కార్యాచరణ చేపడ్డినా మా వంతుగా మేం పాల్గొంటామని అన్నారు.