ప్రభుత్వంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన బంధువులకు, సన్నిహితులకు 31 మద్యం దుకాణాలున్నాయని తాను నిజాయితీగా చెప్పానని, తనకు ఉన్నాయని తాను చెప్పలేదని, చంద్రబాబు దాన్ని వక్రీకరించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లను చంద్రబాబు మూడు రోజులుగా వెల్లడించాలని, లేదంటే తానే వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మద్యం సిండికేట్లలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో చంద్రబాబుకు తెలుసునని, దాన్ని మరుగుపరిచి తమ పార్టీనే లక్ష్యంగా చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఎసిబి నివేదికలోని సమాచారం ద్వారా మద్యం సిండికేట్లకు సంబంధించిన వాస్తవాలు బయటపడతాయని, ఇందులో ఏదీ దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారనే తన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన అన్నారు. శాసనసభలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన తర్వాత మళ్లీ ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం సిండికేట్ల వ్యవహార కన్నా చంద్రబాబుకు మరో ముఖ్యమైన సమస్య లేదా అని ఆయన అడిగారు. రైతు సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు, జూనియర్ డాక్టర్ల డిమాండ్ల వంటివి చంద్రబాబుకు ముఖ్యం కాకుండా పోయాయని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారని, అయినా మద్యం సిండికేట్లపై చర్చకు పట్టుబడుతూ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉంటామని ఆయన చెప్పారు.
సమాచార హక్కు కమిషనర్ల నియామకం ఏకగ్రీవంగా జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ ప్రభుత్వం పద్ధతి ప్రకారం చేసింది కాబట్టే చంద్రబాబు సహకరించారని తాను చెప్పానని ఆయన చంద్రబాబు లాలూచీ పడ్డారని అంతకు ముందు చెప్పిన వ్యాఖ్యలపై వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. లాలూచీ పడ్డారని మీరు అనుకుంటున్నారా, అనుకోండి అని ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. లాలూచీ అని తాను అనలేదని, చంద్రబాబు సహకరించారని తాను అన్నానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభను వాడుకోవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. కోర్టుల్లో స్టే తెచ్చుకోకపోతే చంచల్‌గుడా జైలులో మిగతా ఖైదీలతో యోగక్షేమాలు అడుగుతూ ఉండేవారని ఆయన అన్నారు. తప్పు చేసిన శాసనసభ్యులపై చర్య తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదని, మంత్రులకు బర్తరఫ్ చేయాలని అడిగే హక్కు లేదని ఆయన అన్నారు.
చంద్రబాబుపై ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదని, ఈ రాష్ట్రంలో ఇలా ఉండడం వల్ల మాట్లాడాల్సి వస్తోందని, ఇది కర్మ అని ఆయన అన్నారు. అవినీతి విషయంలో గురువింద సామెత వ్యవహారంగా చంద్రబాబుది ఉందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో తెలుగుదేశం పార్టీవారు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుని మాట్లాడితే చంద్రబాబును నమ్ముతారని, చంద్రబాబు అన్నా హజారేలా ఫోజులు కొడితే ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. తనను తప్పిస్తే పార్టీకి, తెలంగాణకు మేలు జరుగుతుందని తమ పార్టీ అధిష్టానం నమ్మితే తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.