హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు గంటా మురళీ కృష్ణపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఆయన గతంలో చింతలపూడి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మెడికల్ బిల్లుల క్లెయిమ్‌లలో అక్రమాలకు పాల్పడినందుకు గానీ ఈ కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి ఈ అంశంపై వేసిన పిటిషన్‌ను విచారించిన నాంపల్లి 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గంటా మురళిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో మురళిపై ఐపిసి 406, 409, 419, 420, 468, 471, 177, 120బి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ఈ నెల ఎనిమిదిన నమోదు చేశారు.
గంటా మురళీ కృష్ణ సోదరుడి కొడుకు 2008లో అస్వస్థతకు గురై పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందాడు. రూ.72 వేలు బిల్లు కాగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మురళీ కృష్ణ తన సోదరుడి కుమారుడిని తన కుమారుడిగా రికార్డుల్లో పేర్కొని ఆ బిల్లును సచివాలయం నుంచి చెల్లించారు. వాస్తవానికి గంటా మురళికి ముగ్గురూ కుమార్తెలే. తన సోదరుడి కుమారుడు అయిన గంటా హనుమంతరావును తన కుమారుడిగా చూపించి నిమ్స్‌లో వైద్యం చేయించారు. మురళి 2004-09 సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి