బాబాయ్ వివేకానంద కోసం మళ్లీ వైయస్ జగన్?

రాజ్యసభ ఎన్నికల్లో తల్లి వైయస్ విజయమ్మను గానీ, వైయస్ వివేకానంద రెడ్డిని గానీ బరిలోకి దింపి, కాంగ్రెసులోని వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు పొందాలని ఆయన చూస్తున్నట్లు తెలుస్తోంది. తన వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో మార్చి నెలాఖరున జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పావులు కదపాలని ఆయన ఆలోచిస్తున్నారని అంటున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి ఇష్టపడకపోతే వైయస్ విజయమ్మను దింపి విజయం సాధించేలా చూసుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తన వైపు ఉన్న 17 మంది శాసనసభ్యులతో పాటు మరింత మందిని కూడగట్టుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే శానససభా సభ్యత్వానికి 14 రోజుల లోగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేయడం వల్ల ఖాళీ ఏర్పడితే పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీకి దించాలని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ సీటు కోసం వైయస్ వివేకానంద రెడ్డి ఢిల్లీ కాంగ్రెసు పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా వ్యూహం నేపథ్యంలో అధిష్టానం వైయస్ వివేకానంద రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే స్థితిలో లేదని చెబుతున్నారు. దీంతో వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డిని తమ పార్టీలోకి తీసుకుని తగిన గౌరవం ఇవ్వడం ద్వారా రాజకీయాలను మలుపు తిప్పాలని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications