హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ నగారా సమితి చైర్మన్, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బాబు తనపై పోటీ చేసి ధరావత్తు దక్కించుకుంటే తాను శాశ్వతంగా రాజకీయల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. నాగర్ కర్నూల్‌లో తనపై పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి చిదంబరానికి తెలంగాణకు అనుకూలంగా లేఖ రాస్తే తాను రాజకీయాలకు స్వస్తీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం పార్టీ వెంటనే తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేసింది చంద్రబాబే అని ధ్వజమెత్తారు.
పార్టీని రక్షించుకుంటూ వస్తుంది కార్యకర్తలు మాత్రమేనని ఆయన అన్నారు. టిడిపిలో ఉండి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోరాడింది, టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసినా, చంపినా వారికి అండగా నిలిచింది తానేనని అన్నారు. గత ఉప ఎన్నికల్లోనే తెలంగాణలో టిడిపి సత్తా ఏంటో తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోవడం ఖాయమన్నారు. అప్పుడు ఆ పార్టీ బండారం బయటపడుతుందన్నారు. టిడిపి అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని విమర్శించారు. పేదల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ధనవంతుల పార్టీగా మారిందన్నారు. తెలంగాణను అడ్డుకున్న మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబే అన్నారు.