హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడికి మధ్య బుధవారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు శానససభలో ప్రసంగిస్తుండగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - చంద్రబాబు వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు. మాటిమాటికీ దోచుకున్నారని, దోపిడీ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదేదో గొప్పని అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంతో ఉన్నారని, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజా తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ విధంగా మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.
దానిపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - దోపిడీ చేసేవారనే మాట అన్ పార్లమెంటరీ కాదని, ఇంత అవినీతి వేరే దేశాల్లో జరిగి ఉంటే ఉరేసేవారని అన్నారు. తమ విమర్శలను భరించలేకపోతే తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. ఏ విధంగా మాట్లాడాలో చెప్పే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదని ఆయన అన్నారు. 1994లో కాంగ్రెసు కేవలం 24 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయిందని, అయినా తాము కాంగ్రెసుకు మాట్లాడే అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. మాట్లాడే అర్హత లేదని, మాట్లాడవద్దని తాను ఏనాడూ అనలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు మాటలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందిస్తూ - అవకాశం కల్పించేది తాము కాదని, స్పీకర్ కల్పిస్తారని, తాము స్పీకర్‌ను నియంత్రించడం లేదని, చంద్రబాబు తన హయాంలో నియంత్రించారేమో తెలియదని ఆయన అన్నారు.