నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను స్వాగతిస్తానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ శనివారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం నుండి ఆయన సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెపి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో లోక్ సత్తా పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆయన అన్నారు. కొవ్వూరు, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో మరిన్ని గిడ్డంగులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా పోచారం గ్రామం నుండి ప్రారంభమైన ఆయన సత్యాగ్రహ పాదయాత్ర ఎల్లారెడ్డి, బాన్సువాడ, వర్ని, రుద్రూర్, కోటగిరి, ఎత్తొండ మీదుగా బోధన్ చేరుకుంటుంది. బాన్సువాడ, వర్నిల్లో రోడ్డు షోలు నిర్వహిస్తారు. శనివారం రాత్రి బోధన్ లో బస చేసి అదివారం కోటగిరి మండలంలో పర్యటిస్తారు.