హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరాహార దీక్షను విరమింప చేసేందుకే కేంద్ర మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేశారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేస్తే విభనకు దారి తీసినట్లేనని అన్నారు. జగన్, కెసిఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు.
కెసిఆర్ కొవ్వూరులో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు. కెసిఆర్ వచ్చి ప్రచారం చేసుకోవచ్చు.. కానీ ప్రజల మనోభావాలను మాత్రం కించపర్చవద్దని సూచించారు. తాను 13, 14, 15 తేదీల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున కొవ్వూరులో ప్రచారం చేస్తానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.