హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలలో తాము ఫెయిల్ అయ్యామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని, కానీ ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం బీరాలకు పోతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వెంటిలెటర్ మీద నడుస్తోందని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెసును వదిలించుకునేందుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాకే ఆర్టీసి నష్టాల్లో కూరుకు పోతోందన్నారు. ప్రైవేటీకరణ యోచన వెంటనే మానుకోవాలని సూచించారు. లేదంటే టిడిపి ఉద్యమిస్తుందన్నారు. ఆర్టీసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ నుండి సుమారు 70 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళతారన్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను బొత్స ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట జనం లేరని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఉప ఎన్నికల ప్రచారంలో స్పష్టమైందన్నారు. ఇన్నాళ్లూ ఓదార్పు యాత్రలకు జనాన్ని తీసుకు వెళ్లిన జగన్, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందున తీసుకొని వెళ్లలేక పోతున్నారని విమర్శించారు. లక్ష కోట్లు తిన్న అవినీతిపరుడికి ఓట్లు ఎవరూ వేయరని అన్నారు.