హైదరాబాద్: తాము 2014లో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను తాము స్వాధీనం చేసుకుని తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అంకితమిస్తామని, తెలంగాణ భవన్‌ను విక్రయిచి వచ్చే సొమ్మును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచుతామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన శుక్రవారంనాడు కూడా దుమ్మెత్తిపోశారు. తెలంగాణ భవన్ వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం భూమి ఇస్తే నామమాత్రంగా పార్టీని నడుపుతూ ఆ భవనాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థగా కెసిఆర్ నడుపుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ భవన్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు కెసిఆర్, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తోడు దొంగలని, వారిద్దరే తెలంగాణకు అడ్డంకి అని ఆయన అన్నారు. నాగర్ కర్నూలులో మద్దతు కోసం నాగం జనార్దన్ రెడ్డి కెసిఆర్‌కు ముడుపులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.