తెరాస గెలిస్తే తెలంగాణ రాదంటూ ప్రత్యర్థులు ప్రచారం

తెలంగాణలో ఆరు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఐదు స్థానాల్లో తెరాస పోటీ చేస్తుండగా, నాగర్ కర్నూలు స్థానంలో నాగం జనార్దన్ రెడ్డిని బలపరుస్తోంది. మహబూబ్‌నగర్ స్థానంలో తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న బిజెపి, తెరాస రెండు పార్టీలూ పోటీలో ఉన్నాయి. కెసిఆర్‌ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం నాయకులు ప్రతి రోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. టిడిపి తెలంగాణ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రతి రోజూ పాదయాత్ర చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ అడ్డంకిగా ఉన్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తమను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే తెలంగాణ తెచ్చే బాధ్యత తమదేనని కాంగ్రెసు తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలిపించినా తెరాస తెలంగాణ తేలేదని, తెలంగాణను తెచ్చే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందుకేసి, 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇచ్చినా తమకు రాజకీయంగా ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఆ రకంగా ఆయన తెలంగాణకు తాము సుముఖంగానే ఉన్నామని ఆయన చెప్పదలుచుకున్నారు. ఆయన రేపు మహబూబ్‌నగర్‌లో ప్రచారం చేయనున్నారు.
ఉప ఎన్నికలు తెలంగాణ అంశంపై జరగడం లేదంటూనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై మాట్లాడుతూ కెసిఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి. అభ్యర్థులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు అటువంటి ఇబ్బందేమీ లేకుండా పోయింది. తెలంగాణలో ఇప్పటి వరకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ప్రచారానికి దిగలేదు. చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications