మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో రాద్ధాంతం ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సామరస్యపూర్వకమైన వాతావరణంలో రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
ఎన్నికలంటే కోలాహలం, డబ్బు పంపిణీ గుర్తుకు వచ్చేలా చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పారటీలు యువతను బలి చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పార్టీలు రాజకీయ ఎదుగుదల కోసం ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.