మంత్రుల ఇష్యూ, టిడిపితో గొంతు కలిపిన జగన్ పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా మంత్రులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆరుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాతనే వారిని విచారించాలని ఆమె అన్నారు. ఐఎఎస్ అధికారుల విషయంలో కూడా ఇదే విధానాన్ని పాటించాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేయడం సిబిఐకి చెంపపెట్టు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.
జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు నోటీసులు ఇచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 26 జివోలు జారీ చేసిన వారిని వదిలేసి కేవలం జగన్ పైనే సిబిఐ దర్యాఫ్తు చేయడం సరికాదని ఆ పార్టీ సలహాదారు సోమయాజులు అన్నారు. మంత్రులను వదిలేసి జగన్‌ను టార్గెట్ చేయడం సిబిఐ బరితెగింపుకు నిదర్శనం అన్నారు. మంత్రులను, అధికారులను సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర రావు కూడా ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications