హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా వెనుక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఆయన రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. టిడిపిలో ఉన్నపుడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పొగిడిన నల్లపురెడ్డి ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారన్నారు. ఆయన ఓ ఊసరవెల్లి అన్నారు.
ముఖ్యమంత్రికి ధైర్యముంటే తక్షణమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు తోడ్పడేందుకే అప్పటి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే 26 జివోలు జారీ చేసిందని ఆయన ఆరోపించారు. మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసేవారన్నారు.