హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కొల్లాపూర్ తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు మాటలను ప్రజలు నమ్మరని మంత్రి డికె అరుణ మంగళవారం అన్నారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాదన్నారు. తెరాస వల్ల అంతకంటే రాదని ఆమె అన్నారు. అందరూ కలిస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. సెంటిమెంటును క్యాష్ చేసుకునేందుకు జూపల్లి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కొల్లాపూర్‌లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కొల్లాపూరులో తాను తప్ప ఎవరూ గెలవొద్దని జూపల్లి అనుకుంటున్నారని విమర్శించారు. ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. అందుకే ఓటమి భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయా కారణాలతో రాజీనామా చేసిన జూపల్లికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.