అదిలాబాద్: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సొమ్మసిల్లి పోయిందని, తెలంగాణలోని ఆరు స్థానాల ఎన్నికల ఫలితాలతో ఆమె దిమ్మ తిరిగికిందపడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆయన సోమవారం అదిలాబాద్ జిల్లాలో జోగు రామన్నకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణను దశాబ్దాలుగా దోపిడీ చేస్తూ ఇక్కడి వనరులను దోచుకుతింటున్న ద్రోహులకు ఓటు వేస్తే దొంగలకు సద్దిమూట కట్టినట్లేని ఆయన అన్నారు. టిడిపి పక్కా ఆంధ్రుల పార్టీ అని కాంగ్రెసు పెత్తందార్ల పార్టీ అన్నారు. తెలంగాణలో గులాంగిరి చేస్తున్న వారితో జత కట్టిన రెండు పార్టీలు ఇక్కడి నేతలతో బూట్ పాలిషింగ్ చేయిస్తూ గుమాస్తా, డిప్యూటీ ఉద్యోగాలు ఇస్తున్నాయే గానీ రాష్ట్ర అధ్యక్ష, శాసన సభాపతి, స్పీకర్ పోస్టులను ఇస్తున్నాయా అని ప్రశ్నించారు. మళ్లీ రాజీనామా చేసి గెలుపొందాలని కామారెడ్డి సభలో సిపాయిలా పేర్కొన్న చంద్రబాబు.. తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా అందరం రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేసి రావాలని సవాలు విసిరితే చలి జ్వరం పట్టుకొని ఇంట్లో పడుకున్నారన్నారని ఎద్దేవా చేశారు.
ఇంటి దొంగలకంటే ప్రాణగండం మరొకటి ఉండదని, పెత్తందార్ల పల్లకీలు మోస్తున్న తెలంగాణ నేతలకు కర్రు కాల్చి వాత పెడితే తప్ప రాష్ట్రం సాధించలేమన్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవితో పాటు మంత్రి పదవులు అదే పద్ధతిన ఎందుకు కట్టబెట్టడం లేదన్నారు. కిరణ్ రూపాయి కిలో బియ్యం పేరిట ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వారినే గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.