కిరణ్ కుమార్ రెడ్డి సభలో తెలంగాణ నినాదాలు, అరెస్టు
Districts
oi-Srinivas
By Srinivas
|
మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరోసారి తెలంగాణ సెగ తగిలింది. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆయన కొల్లాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు యువకులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డు తగిలాడు. ఆంధ్రా తొత్తుల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. కాగా వారికి పోటీగా మరికొందరు జై కాంగ్రెసు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ సందర్భంలో సిఎం మాట్లాడుతూ.. ఇంతమంది కాంగ్రెసు పార్టీ అభిమానులు వచ్చినప్పుడు ఒకరో ఇద్దరో వచ్చి ఇలాంటి ఆందోళన చేస్తూనే ఉంటారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు కొందరు తెలంగాణవాదులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారం కోసం అదిలాబాద్ జిల్లా వెళ్లారు. అక్కడి రాంలీలా మైదానంలో టిడిపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవురు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.