హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి భారతీయ జనతా పార్టీకి ఝలక్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో తెరాస గెలిస్తే వచ్చేది రజాకార్ల పాలన అని, తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందన్న బిజెపి వ్యాఖ్యలపై ఆమె మండిపడింది. దేశాన్ని బిజెపి వాళ్లు పాలించినప్పుడు తెలంగాణ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. 1998లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు లొంగిపోయారన్నారు. తెలంగాణపై ఆ పార్టీ అప్పుడు ఎందుకు ఫోకస్ చేయలేదని ప్రశ్నించారు. ఆమె టిఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ బిజెపికి దగ్గర అనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు జాతీయ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ యాత్రలో కూడా ఆమె టిఆర్ఎస్ శ్రేణులను కాదని పాల్గొన్నారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమని ఆమె చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అమె బిజెపిని ప్రశ్నించడం గమనార్హం.
కాగా తన నియోజకవర్గంలో రెండు రైల్వే లైన్లు మంజూరు చేసినందుకు కేంద్రానికి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీల అతివిశ్వాసం వల్లే నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. మెదక్ - అక్కన్నపేట రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆమె సంతోషాన్ని వెలిబుచ్చారు. రైల్వే లైన్ మంజూరు కోసం తాను ఎంతగానో కృషి చేశానని అన్నారు. చివరికి తన కల ఫలించిందన్నారు. అలాగే తెల్లాపూర్- పటాన్ చెరువు ఎంఎంటిఎస్ లైన్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె తెలిపారు. అయితే కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు.