ప్రతీరోజూ హైదరాబాద్ నుండి గోవాకు రైళ్ళు.. ఏపీ, తెలంగాణా ప్రజలు పండుగ చేస్కోండి!
గోవా వెళ్ళాలి అనుకునేవారికి శుభవార్త. గోవా వెళ్లాలనుకునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇకపై వారంలో ఏ రోజు అయినా హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సంతోషకరమైన విషయాన్ని ప్రకటించింది.
గోవా వెళ్లేందుకు రైళ్ళు
ఇంతకుముందు వారంలో రెండు రోజులు మాత్రమే రైళ్లు ఉండటంతో తేదీలు బట్టి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయింది.గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ-యలహంక ఎక్స్‌ప్రెస్ (17603) ద్వారా గుంతకల్ వద్ద బోగీలు మార్చుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా అవుతూ, ప్రయాణం అసౌకర్యంగా ఉండేది. 2024 అక్టోబర్‌లో సికింద్రాబాద్-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ (17039) ప్రారంభమై నేరుగా గోవా చేరుకునే అవకాశం వచ్చింది.

హైదరాబాద్ నుంచి గోవాకు వారంలోని ప్రతి రోజూ రైలు సర్వీసులు
అయితే ఈ రైలు వారంలో ప్రతీ బుధవారం, శుక్రవారం మాత్రమే నడుస్తూ ఉంది. ఈ లోటును తీర్చడానికి రైల్వే శాఖ కొత్త చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్-బెలగావి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గోవాకు వారంలోని ప్రతి రోజూ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ బుధవారం మరియు శుక్రవారం సికింద్రాబాద్ - వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ నేరుగా గోవా వరకు వెళ్తుంది. మంగళవారం జస్డీ - వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్/చర్లపల్లి నుంచి ప్రారంభమై వెళ్తుంది.
పర్యాటకులకు ప్రతీరోజూ రైళ్ళు ఉండటం హ్యాపీ న్యూస్
సోమవారం, గురువారం, శనివారం బెలగావి ఎక్స్‌ప్రెస్ రైళ్లు (లోండా స్టేషన్ వరకు). లోండా నుంచి గోవాకు ప్రైవేటు వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. గోవా సందర్శకుల్లో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ప్రతి సంవత్సరం దాదాపు 16 లక్షల మంది తెలుగు ప్రజలు గోవా వెళ్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టిన ఈ కొత్త సర్వీసులు పర్యాటకులకు పెద్ద ఊరటనిస్తున్నాయి.
రైల్వే శాఖ డిమాండ్ ను బట్టి తీసుకున్న నిర్ణయం.. ప్రయాణికులకు సంతోషం
ఈ అదనపు రైళ్ల వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, టికెట్ల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే ప్రయాణికులు ఇక తేదీలు బట్టి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మొత్తానికి రైల్వే శాఖ డిమాండ్ ను బట్టి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
.













Click it and Unblock the Notifications