ప్రచారానికి తెర: తెలంగాణ కారుకు బ్రేకులు వేస్తారా?

తెలంగాణ సెంటిమెంటుపైనే విజయాన్ని అందుకుంటామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే, పాలక కాంగ్రెసు పార్టీ మజ్లీస్‌తో కలిసి పావులు కదిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు స్థానాల్లోని రెండు స్థానాల్లో విజయం సాధించడానికి కాంగ్రెసు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి కాంగ్రెసు పని చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉంటుందని భావించి తన దృష్టిని కాంగ్రెసు ఇక్కడ కేంద్రీకరించినట్లు చెబుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో తెరాసతో పాటు తెలంగాణ సెంటిమెంటుపైనే బిజెపి కూడా రంగంలో ఉంది. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ పోటీకి దిగారు. ఆయన ఆ ఇద్దరు అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్‌గా తెరాస మద్దతుతో పోటీ చేస్తున్నారు. కాగా, కొల్లాపూర్ ఎన్నికను మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన జూపల్లి కృష్ణారావును ఓడించి జిల్లాల్లో పూర్తి పట్టు సాధించాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. ఇంతకు ముందు కాంగ్రెసులో ఉన్న జూపల్లి కృష్ణారావు ఇప్పుడు తెరాస అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కామారెడ్డిలో తెరాస కాంగ్రెసు నుంచి పోటీ ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్, స్టేషన్ ఘనపూర్‌ల్లో తెరాస విజయం సునాయసమే కావచ్చునని చెబుతున్నారు.
కాగా, కోవూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. తన పార్టీ అభ్యర్థి కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.