పల్లీ రైస్ ఇలా తయారుచేస్తే మెతుకు కూడా మిగల్చరు!
వేగంగా, రుచికరంగా లంచ్ బాక్స్ లోకి టేస్టీ, స్పైసీ మంచి పౌష్టికాహారం తినాలనుకుంటే పల్లీల అన్నం చాలా మంచి రెసిపీ. పల్లీల రైస్ ను మిగిలిన అన్నంతో సులభంగా తయారుచేయవచ్చు. ఇది చల్లారిన తర్వాత కూడా రుచిగా ఉంటుంది. చూడటానికి బాగుంటుంది, దీనికి వేరే సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఇకపల్లీల అన్నం ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
వేరుసెనగపప్పు: 1/4 కప్పు
నువ్వులు: 1/4 కప్పు
ఎండు మిర్చి: 4
పచ్చి కొబ్బరి (తురిమినది): 1/4 కప్పు
ఉడికించిన అన్నం: 1 కప్పు
ఉప్పు: తగినంత
నూనె: 1/4 కప్పు
ఆవాలు: 1/2 టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
శెనగపప్పు: 1 టీస్పూన్
కరివేపాకు: 2 రెమ్మలు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, పాన్ లో పావు కప్పు వేరు శనగపప్పు, పావు కప్పు నువ్వులు, నాలుగు ఎండు మిర్చి వేసి సిమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలి. తరువాత అదే పాన్ లో తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే పల్లీల రైస్ సూపర్
ఆపై అదే పాన్ లో నూనె వేసుకుని తాలింపు గింజలు వేసి పోపు చేసుకోవాలి. ఈ పోపులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఆపై అందులో అన్నం వేసి, మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇది లంచ్ బాక్సులోకి చాలా బాగుంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే టేస్టీ పల్లీల రైస్
పల్లీల అన్నం అద్భుతమైన రుచిని పొందాలంటే కొన్ని చిట్కాలు ముఖ్యం. తాలింపులోని పప్పు దినుసులు, వేరుసెనగపప్పును సన్నని సెగపై నెమ్మదిగా, ఎర్రగా, కరకరలాడే వరకు వేయించాలి. ఇలా లోపలి వరకు వేగితేనే అన్నానికి మంచి రుచి వస్తుంది. ముఖ్యంగా, ఎండాకాలంలో పచ్చి కొబ్బరిని నేరుగా అన్నంలో కలిపితే త్వరగా పాడవుతుంది. రుచి తగ్గకుండా, అన్నం చెడిపోకుండా ఉండాలంటే, పచ్చి కొబ్బరిని తాలింపులో వేసి వేయించడం ఉత్తమం.













Click it and Unblock the Notifications