చైతూతో పెళ్లి.. ట్రోల్స్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన శోభిత!
గత కొన్నేళ్లుగా నటి శోభితా ధూలిపాళ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. శోభిత టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ నిరంతరం హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యతో ఆమెకు ఉన్న బంధం, ఆ తర్వాత జరిగిన వివాహం గురించి నెటిజన్లు, మీడియా చేసినన్ని చర్చలు వేరే సెలబ్రిటీ విషయంలోనూ జరగలేదని చెప్పవచ్చు. వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై రకరకాల ఊహాగానాలు, స్టోరీలు నిత్యం వెలువడుతూనే ఉండటంతో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చింది.
గతంలో ఉన్న పుకార్లకు తెరదించుతూ నాగచైతన్య, శోభితా ధూలిపాళ 2024 ఆగస్తులో చాలా నిశ్శబ్ధంగా ఎంగేజ్మెంట్ చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ మాసంలో అత్యంత వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దక్షిణాది ఫిల్మ్ హిస్టరీలోనే మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో ఒకటిగా నిలిచిన వీరి పెళ్లి.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ భారీ హల్‌చల్ సృష్టించింది. అయితే పెళ్లయిన కొన్ని నెలల తర్వాత శోభిత తన వైవాహిక జీవితంపై, అలాగే తనపై వచ్చే నెగెటివిటీపై ఎట్టకేలకు స్పందించింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలపై మనసు విప్పింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎదురైన రకరకాల సంఘటనలు తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని, మెచ్యూరిటీని పెంచాయని ఆమె పేర్కొంది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఉండేది కేవలం సహజమైన ఉత్సుకత మాత్రమేనని, అందుకే వారు తమ గురించి అంతగా మాట్లాడుకుంటారని చాలా సానుకూలంగా అభిప్రాయపడింది.
తాను ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతానని, తన చుట్టూ ఇతరులు చేసే ప్రతి చర్చకు లేదా విమర్శకు స్పందించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని శోభిత స్పష్టం చేసింది. కాలక్రమేణా తన ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు ఇతరులు తనపై వ్యక్తపరిచే భిన్నాభిప్రాయాలు లేదా నెగెటివ్ కామెంట్లు తన మనశ్శాంతిని ఏమాత్రం దెబ్బతీయలేకపోతున్నాయని ఆమె చాలా ధీమాగా వెల్లడించింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ను శోభిత మారుతున్న వాతావరణ పరిస్థితులతో పోల్చడం విశేషం. "ఇక్కడ ప్రతి చిన్న విషయంపై విపరీతమైన చర్చలు, తీవ్రమైన స్పందనలు రావడం సర్వసాధారణం. నేను వీటన్నింటినీ వాతావరణ మార్పుల లాంటివేనని అనుకుంటాను. సమాజంలో కూడా కొన్ని వాతావరణ పద్ధతులు ఉంటాయి. దేన్నీ మనం మరీ అంత సీరియస్‌గా తీసుకోకూడదు, ఎందుకంటే ఇవేవీ శాశ్వతం కావు. వాతావరణం ఎలా మారుతుందో.. జనం అభిప్రాయాలు, సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా అలాగే మారిపోతుంటాయి" అని శోభిత తనదైన శైలిలో వివరించింది.
అందుకే జీవితంలో వచ్చే విమర్శలను గానీ, వచ్చే ప్రశంసలన గానీ తలకెక్కించుకోకుండా మనశ్శాంతితో ముందుకు సాగడం ముఖ్యమని శోభితా ధూళిపాళ చెప్పుకొచ్చింది. 2021లో సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత, 2022 నుండి చైతూ-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇన్నేళ్లూ ఎన్నో రూమర్లు వచ్చినా, నిశ్చితార్థం జరిగే వరకు ఈ జంట ఎక్కడా నోరు మెదపలేదు. ప్రస్తుతం శోభిత మాటలను బట్టి చూస్తే.. ఆమె బయటి ప్రపంచం ఏమనుకుంటుంది అనే దానికంటే, తన భర్త నాగచైతన్యతో కలిసి తన వ్యక్తిగత సంతోషాన్ని ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications