హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పార్టీ అధిష్టానం బుధవారం మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనపై సీరియస్ అయినట్లుగా సమాచారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలలో ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం వచ్చాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏడు నియోజకవర్గాలలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోక పోవడంపై బొత్సపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే నివేదిక పంపాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 2009లో గెలుచుకున్న స్టేషన్ ఘనపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో పట్టు నిలుపుకోకుండా మూడు, రెండో స్థానాలలో ఉండటాన్ని, అదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలినప్పటికీ క్యాష్ చేసుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మూడు స్థానాలలో కాంగ్రెసు రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొవూరు నియోజకవర్గంలోనూ మూడో స్థానానికి పడిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై వివరణ అడిగినట్లుగా సమాచారం. నల్లపురెడ్డి టిడిపి నుండి బయటకు వచ్చి, ఆ పార్టీ ఓట్లు చీల్చినప్పటికీ కాంగ్రెసు మూడో స్థానంతో సరిపెట్టుకోవడం అధిష్టానం జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం.