హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామాను కోరడంపై కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు స్పందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. డిఎల్ తీరు చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. ఆయన వైఖరి వల్ల పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పార్టీ ఓడినప్పుడే ఆయన రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స రాజీనామా అడిగే హక్కు ఉండేదన్నారు. ఇప్పుడు ఆయనకు వారి రాజీనామా అడిగే హక్కు లేదన్నారు. కొవూరులో మా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెసు వాళ్లు కాంగ్రెసు నేతలను టార్గెట్ చేయడం వార్త కాదన్నారు. కొవూరులో జగన్ పార్టీ గెలుపు తాత్కాలికమేనని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స రాజీనామా డిఎల్ కోరడాన్ని మీడియా పాయింట్ వద్ద రుద్రరాజు పద్మరాజు తప్పు పట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగాయో అందరూ తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు 2008లో ఉన్న పరిస్థితులు వేరని అన్నారు. నేతల పైన బురద జల్లే వారు వారు పార్టీకి ఏం చేశారో మొదట తెలుసుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నేతలు ప్రజల్లోకి వెళ్లి కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచాలని అన్నారు. వ్యక్తిగత అజెండాలతో మాట్లాడి ప్రజల్లో, కార్యకర్తల్లో పలుచన కావొద్దన్నారు.