తెలంగాణపై లోకసభలో రగడ: ఒప్పిస్తామన్న పొన్నం

ఆరుగురు కాంగ్రెసు పార్టీ ఎంపీలు కూడా తెలంగాణ కోసం విద్యార్థులు, యువత ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో మృతి చెందిన బోజ్యా నాయక్ చిత్రపటాన్ని చూపిస్తూ తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు నిరసన తెలిపారు. అంతకుముందు ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
లోకసభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఇంత ఉద్యమం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. ఒకరు సెంటిమెంట్ లేదని మరొకరు మరోవిధంగా అంటారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులు, యువతకు సూచించారు. మేం తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు సానుకూలంగా ఉన్నారని, కానీ సమైక్యవాదులు ఆమెను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం మేం బలవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. మేం ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణపై ఇప్పుడు చర్చ అవసరం లేదని అన్నారు. ఇదివరకే చర్చ జరిగిందన్నారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని వివేక్ డిమాండ్ చేశారు. సీమాంధ్ర కుట్రలో భాగస్వాములై తెలంగాణ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొట్టవద్దన్నారు. అందరం కలిసే తెలంగాణ కోసం ఉద్యమిస్తామన్నారు. కేంద్రం తెలంగాణపై హామీ నిలబెట్టుకోవాలని ఎంపీ వివేక్ అన్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలన్నరు. గండ్ర, రేణుక చౌదరి వంటి నేతల వల్లే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మా సహనం అసమర్థత కాదని కేంద్రాన్ని హెచ్చరించినట్లు చెప్పారు.