తిరుపతి: విలీనానికి అర్థం లేకుండా పోతోందన్న మంత్రి సి.రామచంద్రయ్య సోమవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను అలా వ్యాఖ్యానించానని అన్నారు. పార్టీలోని నేతలందరూ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ కేడర్‌లో ఉన్న అభిప్రాయమే తాను చెప్పానని అన్నారు. జిల్లాలో నేతల సమన్వయం కోసం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పిఆర్పీ బలాన్ని కాంగ్రెసు కలుపుకు వెళ్లడం లేదని ఆరోపించారు. దీన్ని అలుసుగు తీసుకొని ప్రత్యర్థి పార్టీలు వల వేస్తున్నాయన్నారు. నా వ్యాఖ్యలను కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం సలహాలుగా స్వీకరించాలన్నారు. పోస్టుల్లో ఓట్ల శాతానికి తగినట్లుగా పిఆర్పీకి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిఆర్పీ కేడర్‌కు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. మూడు పదవులు ఇచ్చినంత మాత్రాన న్యాయం చేసినట్టు కాదన్నారు.
కాంగ్రెసును భవిష్యత్తులో మేమే ముందుండి నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద పలుకుబడి ఉందన్నారు. చిరంజీవిని సోనియా గౌరవంగా చూస్తున్నారన్నారు. చిరంజీవికి కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమన్నారు. అయితే ఆయనకు కేబినెట్ హోదా వస్తుందో లేక సహాయ హోదా వస్తుందో మాత్రం తెలియదన్నారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కాగా ఆదివారం ఆయన కాంగ్రెసు పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.