WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ? 70 దేశాల బాటలో భారత్..!
దేశంలో ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని ) విధానాన్ని పాటించాలని ప్రధాని మోడీ నిన్న పిలుపునిచ్చారు. అయితే ఉన్నట్లుండి ప్రధాని మోడీ ఇచ్చిన ఈ పిలుపుతో కంపెనీలతో పాటు ఉద్యోగులు కూడా తమ రూటు మార్చుకోవాల్సి వస్తోంది. ఇంటి నుంచి పని చేసుకోవాలంటూ (WFH) ఇంతకీ ప్రధాని మోడీ ఎందుకు పిలుపునిచ్చారు, దీని వెనుక ఏముందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. దీనికి సమాధానం అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) చెబుతోంది.
ఇంధన సంక్షోభాల సమయంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా రిమోట్ వర్క్ ( ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పని చేయడం ) అత్యంత వేగవంతమైన మార్గాలలో ఒకటిగా మారింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం తాజాగా 70కి పైగా దేశాలు రిమోట్ వర్క్‌ను ప్రోత్సహించడం, ప్రయాణాలను తగ్గించడం వంటి ఇంధన పొదుపు చర్యలను ప్రవేశపెట్టాయి. థాయ్‌లాండ్, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఇంధన డిమాండ్ నేపథ్యంలో ఇప్పటికే వర్క్-ఫ్రమ్-హోమ్ లేదా ఆఫీసుకు హాజరును తగ్గించే విధానాలను ప్రకటించాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయాణ సంబంధిత ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ చమురు వినియోగంలో దీని వాటానే అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, ఆఫీస్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాణిజ్య భవనాలలో విద్యుత్ డిమాండ్‌ను కూడా ఇది తగ్గిస్తుంది. రిమోట్ వర్క్ చేయగల ఉద్యోగులు వారానికి ఒక్క రోజు మాత్రమే ఇంటి నుండి పనిచేస్తే, వార్షిక ప్రపంచ కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని అంతర్జాతీయ ఇంధన సంస్ధ అంచనా వేస్తోంది. దిగుమతులు, విదేశీ ప్రయాణ ఖర్చుల నుండి డాలర్ల ప్రవాహాన్ని తగ్గించే విస్తృత ప్రయత్నంలో భాగంగా దేశీయ పర్యాటకం, స్థానికంగా తయారైన ఉత్పత్తులను వాడాలని ప్రధాని కూడ కోరారు.












Click it and Unblock the Notifications