తెలంగాణ హీట్: పరిష్కారంపై డైలమాలో సోనియా?

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి శానససభ్యులు, స్వతంత్ర సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ అంశంపై శానససభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో సభ కార్యక్రమాలేవీ చేపట్టకుండా రేపటికి వాయిదా పడింది. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించే వరకు సభను సాగనివ్వబోమని వారు చెప్పారు. శనివారంనాడు విద్యార్థి బోజ్యా నాయక్, సోమవారంనాడు ఆటో డ్రైవర్ రాజమౌళి తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మరోసారి ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు శానససభా సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్తామని చెబుతున్నారు.
మరోవైపు, తెలంగాణ అంశంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. తెరాస పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి లోకసభ కార్యక్రమాలను స్తంభింపజేశారు. వారికి కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా తోడు నిలిచారు. తెలంగాణపై లోకసభలో మౌనంగా కూర్చోవడానికి తమ పార్టీ సభ్యులే నిరాకరిస్తుండడం కాంగ్రెసు నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదిలా వుంటే, కాంగ్రెసు సభ్యుడు కె. కేశవరావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెసు అధిష్టానంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన అందరిపై ఉందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్య ఏ ఒక్క పార్టీకో సంబంధించి కాదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య సున్నితమైందని, సంప్రదింపులకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. పార్లమెంటులో అందరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. అభిషేక్ మను సింఘ్వీ మాటలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు వినే స్థితిలో లేరు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటామని వారు స్పష్టంగానే చెప్పారు. తెలంగాణపై చర్చ చేపట్టే వరకు లోకసభను నడవనివ్వబోమని కెసిఆర్ కూడా చెప్పారు.
ఈ స్థితిలో తెలంగాణ సమస్య ఢిల్లీకి కూడా సమస్యగానే మారే అవకాశం ఉంది. దీన్ని బిజెపి అవకాశంగా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలను, తాజా పరిణామాలను, రాష్టంలో పార్టీ దుస్థితిని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశలో సోనియా ఆలోచన చేస్తారని అంటున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు కూడా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.