తెలంగాణ: నేతలపై డికెఅరుణ ఫైర్, జూపల్లితో వాగ్వాదం

ఆర్డీఎస్ అంశంపై ఇన్నాళ్లు పుట్టుకు రాని ప్రేమ కొందరు నేతలకు ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అని ఆమె నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా గుర్తుకు రావడం సంతోషకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేసిన నాగం, అప్పుడు సొంత పార్టీలో ఉన్న జూపల్లికి ఆర్డీఎస్ ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వారిని చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. తాను గతంలో ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేయలేదని నిరాహార దీక్ష చేశానని ఆమె గుర్తు చేశారు. మీ రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణ పేరు చెప్పి లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు.
తమకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా ఫరవాలేదన్నారు. కానీ మీ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని సూచించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మీ భవిష్యత్తు కోసం వారి ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. వివిధ అంశాలపై స్థానికులను అనవసరంగా రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ తెలంగాణను కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ కోసం తాము పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. తెలంగాణ పేరు చెప్పి లబ్ధి పొందుతున్న వారిలో ఎంతమంది రాజకీయ నాయకులకు ఆ అంశం పట్ల చిత్తశుద్ధి ఉందో చెప్పాలన్నారు.
తెలంగాణ అంటున్న వారు అందరితో కలిసి పోరాడుతున్నారా అని ప్రశ్నించారు. ఎవరూ తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ బాధ్యత రాజకీయ నాయకులం తీసుకుంటామని చెప్పారు. మేం ముందుంటామని చెప్పాల్సిన నేతలు విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం అందరు కలిసి రావాలన్నారు. మేం అధికారంలో ఉండి తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. కాగా ఆర్డీఎస్ కోసం నాగం, జూపల్లి మంత్రి సుదర్శన్ రెడ్డి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో వారితో డికె అరుణకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి సాయంత్రంలోగా మ.నగర్‌కు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
కాగా డికె అరుణ అర్డీఎస్ పై ఫిర్యాదు ఎందుకు చేశారని జూపల్లిని ప్రశ్నించారు. అనంతరం జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ కొందరికి పదవులే పరమావధిగా మారాయన్నారు. తెలంగాణ రావడమే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు.












Click it and Unblock the Notifications