హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. సోనియా ప్రధాని పదవే లెక్క చేయలేదన్నారు. జగన్ తన పని తాను చూసుకోవాలని హితవు పలికారు. జగన్ తానో పెద్ద నేతగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియాతో జగన్ పోల్చుకోవడం నక్కకు నాగలోకానికి పోల్చుకోవడమే అన్నారు. సోనియాపై జగన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
జగన్ రాష్ట్రానికి ఏం చేశారని మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. సోనియా గురించి మాట్లాడే కనీస అర్హత లేని జగన్ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నారన్నారు. జగన్ కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం లాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యర్థేనని అన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ అవినీతి నిరోధకులేనని మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.