లష్కరే తొయిబా భారీ కుట్ర.. 500 మంది ఉగ్రవాదులతో చొరబాటుకు స్కెచ్!
భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తొయిబా' మళ్లీ కశ్మీర్‌లో యాక్టివ్ అయ్యేందుకు ఓ ప్రమాదకరమైన వ్యూహాన్ని రచించింది. లష్కరే తొయిబా అగ్రనాయకులు పాకిస్థాన్‌లోని రాజకీయ ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను సిద్ధం చేయడం, భారత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా, ఇతర వేదికలపై ప్రచార యుద్ధాన్ని తీవ్రతరం చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
భారత రక్షణ దళాలపై ఒత్తిడి పెంచేందుకు గాను పీవోకేలో లష్కరే తొయిబా తన లాంచ్ ప్యాడ్‌ల సంఖ్యను విపరీతంగా పెంచుతోంది. గతంలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాల నుంచే చొరబాట్లకు ప్రయత్నించే ఉగ్రవాదులు, ఇప్పుడు కొత్తగా అనేక స్థావరాలను నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు 500 మందికి పైగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండి వీరి ప్రయత్నాలను తిప్పికొడుతుండటంతో ఉగ్ర కమాండర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో లాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల సంఖ్యను 1000కి పైగా పెంచి.. రోజువారీ చొరబాటు ప్రయత్నాలను 5 నుంచి ఏకంగా 20కి పెంచాలని వారు ప్లాన్ చేస్తున్నారు.

ఈ కొత్త కుట్రలో భాగంగా లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను సంస్థకు కొత్త బాస్‌గా తీసుకురావడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఇటీవల తల్హా సయీద్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత ఆప్తుడైన రాణా సనావుల్లాతో భేటీ అయ్యాడు. హఫీజ్ సయీద్‌ను కేవలం ఓ మార్గదర్శిగా ఉంచి, యువకుడైన తల్హా సయీద్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు పీఓకే మాజీ ప్రధాని సర్దార్ అత్తీక్ అహ్మద్ ఖాన్‌తో కూడా లష్కరే నేతలు సమావేశమై, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా మళ్లీ రచ్చ చేయడం, సరిహద్దుల్లో ఉగ్రవాదుల మోహరింపును పెంచడంపై చర్చించారు.
Senior Pakistani political figures seen openly interacting with globally designated terrorist Hafiz Talha Saeed (Hafiz Saeed’s son and no. 2 in Lashkar network).
— Riccha Dwivedi (@RicchaDwivedi) May 25, 2026
Among those seen sharing space with him were PM advisor Rana Sanaullah, PMLN General Secretary Mian Ahsan Tarar, and… pic.twitter.com/ttx5mVgJad
గతంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కరే అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి లష్కరేకు చెందిన ప్రధాన మురిద్కే ట్రైనింగ్ సెంటర్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ కోలుకోలేని దెబ్బ తగిలినప్పటికీ ఉగ్రవాద సంస్థలు తమ వక్రబుద్ధిని మార్చుకోలేదు. స్థానిక ఉగ్రవాద సంస్థలను బలోపేతం చేస్తూ, పాకిస్తాన్ ఉగ్రవాదుల ద్వారా కశ్మీర్ లోయలో మళ్లీ పెద్ద ఎత్తున దాడులు చేయించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
లష్కరే తోయిబా ఈ సమయంలోనే కశ్మీర్ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి కల్లోలం సృష్టించాలని అనుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అభివృద్ధి శూన్యమంటూ అక్కడి ప్రజలు గత కొన్ని నెలలుగా తీవ్ర నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ప్రజల దృష్టిని ఈ సమస్యల నుంచి మళ్లించడానికి కశ్మీర్ సరిహద్దు వివాదాన్ని లష్కరే పెద్దదిగా చేయాలని చూస్తోంది. ఈ ఉగ్ర కుట్రలను ముందే పసిగట్టిన భారత నిఘా వర్గాలు, సరిహద్దుల్లోని భద్రతా దళాలను మరింత అప్రమత్తం చేశాయి.












Click it and Unblock the Notifications